ఫ్యూచర్ ప్లానింగ్...!
____________________



నాలుగైదేళ్ళ క్రితం మా అమ్మ అప్పుడప్పుడు ఒక మాట అంటుండే వారు. "సంపాదించేవన్నీ మీకే అప్పజెప్పితే రేపు మా భవిష్యత్తు ఏమిటీ..?! " _ అని.
కాలం గడిచింది. ఇల్లు వాకిలి, చెట్టు పుట్ట వగైరాలన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. ఈ రోజు అమ్మ, నాన్న ఇద్దరూ లేరు. కాల ప్రవాహంలో వారు ఎదురు చూసిన భవిష్యత్తు వర్తమానమయ్యేటప్పటికి వారు కాలంలో కలిసి పోయారు.
ఇంకొద్ది సంవత్సరాలలోనే నేనూ కాలంలో కలిసి పోతాను. అది అర్థమయ్యే సరికి నాకు నా భవిష్యత్తు కోసం ఆస్థులు కూడబెట్టాలనుకోవడం, ఫ్యూచర్ గురించి దిగులు పెట్టుకోవడం నిరర్థకం అనిపించింది.
దానికి బదులుగా పిల్లల ఫ్యూచర్ కోసం ప్లానింగ్ బెటర్ అనిపించింది. పిల్లల ఫ్యూచర్... జీవితం..!? ఎన్నాళ్ళు.. ఎన్నేళ్ళు..!? ఇంకో డెబ్భై ఎనభై సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో వారూ ఉండరు. కరెన్సీ కాగితాలు, కాంక్రీట్ బిల్డింగ్ లు మాత్రం ఇక్కడే ఉంటాయి.
ఎవరూ శాశ్వతం కానపుడు… ఎవరిది భవిష్యత్తు? ఆలోచిస్తే అనిపించింది, అది ఒక వ్యక్తిది కాదు. ఒక తరానిదీ కాదు. ఒక వంశానిదీ కాదు.!
భవిష్యత్తు అనేది బాక్టీరియా నుండి మానవ జాతి వరకూ మొత్తంగా భూమి మీద అల్లుకు పోయిన జీవానిదే గానీ ఏదో ఒక వ్యక్తికో ఒక జాతికో స్వంతం కాదు.
మన కనుచూపు మేరలో విశ్వంలో మరెక్కడా కనిపించని 'జీవం' భూమికి ప్రత్యేకం. 'జీవం' అపురూపమైనది. బాక్టీరియాగా ప్రారంభమై, మహాకాయంతో భూమిని ఏలిన డైనోసార్ లుగా ఎదిగి, అంతరించినా, ఆపై కాలగమనంలో మానవులుగా అవతరించినా... ఇప్పటి వరకూ అనేక జాతులుగా అంతరించినా మరెన్నో రకాల జాతులుగా రూపు మార్చుకున్నదే కాని జీవం మాత్రం అంతరించలేదు. దానికి అనుకూలమైన పర్యావరణం భూమికి ఓ వరం. ప్రత్యేకం.
అటువంటి పర్యావరణాన్ని ఒక్క మానవజాతే కాదు, మరే ఇతర జాతి- మొత్తంగా 'జీవం' అనేదే మనుగడ సాగించలేని విధంగా, భూమిని నిర్జీవంగా మర్చేలా ఉంది మానవ జీవన ప్రస్థానం.
అందుకే భవిష్యత్తుకు, భావితరాలకు ఇవ్వగలిగిన, ఇవ్వాల్సిన అసలైన ఆస్థి, స్వచ్ఛమైన సహజమైన పర్యావరణం మాత్రమే.
ఆర్టిఫిషియల్ ఆస్థులకోసం ఈ సహజ వాతావరణాన్ని ధ్వంసం చేస్తూపోతే భవిష్యత్తులో ఈ మండే భూగోళం మీద మనం కూడబెట్టే ఆస్థులు అనుభవించడానికి మన మనవలు వారసులే కాదు, అసలు జీవమే ఉండదు.
****************************************

Comments